నెల్లూరు, 8 ఆగస్టు (హి.స.)
కదులుతున్న రైలులో మంటలు ఎగసిపడడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎమర్జెన్సీ చైన్ లాగి రైలును ఆపేశారు. రైలు ఆగిన వెంటనే కిందకు దిగి పరుగులు పెట్టారు. నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం చోటుచేసుకుందీ ఘటన. ప్రయాణికులు, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. చాప్రా నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న గంగా-కావేరి ఎక్స్‌ప్రెస్ (12670) లో అగ్ని ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి గేటు సమీపంలో సాంకేతిక లోపం కారణంగా ఇంజిన్ వెనుక బోగీలో మంటలు ఎగసిపడ్డాయి.
దట్టమైన పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఎమర్జెన్సీ చైన్ లాగడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును ఆపారు. ప్రయాణికులు కిందకు దిగి దూరంగా పరుగులు తీశారు. బ్రేక్ బైండింగ్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయని గుర్తించిన సిబ్బంది.. మరమ్మతులు చేశారు. అరగంట తర్వాత రైలు తిరిగి బయలుదేరిందని సిబ్బంది తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి