అమరావతి, 8 ఆగస్టు (హి.స.)దేశంలో వర్షాల వెదర్ మళ్లీ మారింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో ఆగస్టు 12 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD Alert) తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీ, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లలో ఆగస్ట్ 8 నుంచి 12 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
దీంతోపాటు ఆగస్ట్ 8 నుంచి అరుణాచల్ ప్రదేశ్‌లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోనూ ఆగస్ట్ 8 నుంచి 10 వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అక్కడి చాలా నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, అక్కడ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. దీంతో రానున్న రెండు వారాల్లో కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని, అందుకే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వెదర్ రిపోర్ట్ తెలిపింది. సెప్టెంబర్ కల్లా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి