ముంబయి,10, సెప్టెంబర్ (హి.స.) బంగారం ధర పట్టపగ్గాలు లేకుండా పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయంగా కేంద్రీయ బ్యాంకులతో పాటు మదుపర్లు ఈ లోహంపై పెట్టుబడులు పెడుతుండడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 3645 డాలర్లకు చేరింది. డాలర్ విలువ కూడా రూ.88.15 కావడంతో, దేశీయంగా పుత్తడి ధర మరింత ఎక్కువగా ఉంది. హైదరాబాద్ బులియన్ విపణిలో మంగళవారం 10 గ్రాముల మేలిమి (999 స్వచ్ఛత) బంగారం ధర రూ.1,12,800కు చేరింది. సోమవారంతో పోలిస్తే గ్రాముకు రూ.200కు పైగా (10 గ్రాములకు రూ.2,000కు పైగా) ధర పెరిగినట్లు బులియన్ వర్గాలు తెలిపాయి. కిలో వెండి ధర రూ.1,27,500కు మించింది.
ఎంసీఎక్స్‌లోనూ
ఆన్‌లైన్‌లో లోహాల ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్ (మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్)లో పసిడి 10 గ్రాముల కాంట్రాక్టు (అక్టోబరు) రూ.1,09,060 వద్ద ఉంది. ఒకదశలో రూ.1,09,840కు చేరింది కూడా. సోమవారంతో పోలిస్తే, ఈ ధర 0.50% పెరిగింది. అంతర్జాతీయంగా ఔన్సు ధర ఒకదశలో 3659 డాలర్లు పలికింది కూడా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ