ఖాట్మండు/న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.) : నేపాల్‌లో అస్థిరత కారణంగా మెరుగైన జీవితం కోసం భారత్‌లోకి నేపాలీలు చొరబడే ప్రమాదం ఉండటంతో 1,751 కి.మీ.ల పొడవైన సరిహద్దు వెంట సశస్త్ర సీమాబల్ (ఎస్‌ఎస్‌బీ) బలగాలు కాపలాను కట్టుదిట్టం చేశాయి. సున్నితమైన పాయింట్లతోపాటు బోర్డర్ పోస్ట్‌ల వద్ద భద్రతను మరింత పెంచారు. 22 ఔట్‌పోస్ట్‌ల వద్ద అదనపు బలగాలను రప్పించారు. పోలీస్, ఎస్‌ఎస్‌బీ బృందాలు పెట్రోలింగ్‌ను తీవ్రతరంచేశాయని ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్ పోలీస్ సూపరింటెండెంట్ వికాస్ చెప్పారు.
భారతీయులకు అడ్వైజరీ జారీ
సంక్షోభ నేపాల్‌కు వెళ్లొద్దని భారతీయులకు భారత విదేశాంగ శాఖ మంగళవారం ఒక అడ్వైజరీ జారీచేసింది. వివిధ కారణాలతో ఇప్పటికే నేపాల్‌లో ఉన్న భారతీయులు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగే ప్రాంతాల వైపు వెళ్లొద్దని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ