న్యూఢిల్లీ,10,సెప్టెంబర్ (హి.స.) లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై భాజపా కార్యకర్తలు దాఖలుచేసిన కేసుల పరంపర కొనసాగుతోంది. ఆయన బ్రిటిష్ పౌరుడంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేసిన భాజపా కార్యకర్త ఎస్.విఘ్నేశ్ శిశిర్ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సమక్షంలో తన వాంగ్మూలం ఇచ్చారని అధికార వర్గాలు తెలిపాయి. విదేశీ మారక నిర్వహణ చట్టం(ఫెమా)లోని సెక్షన్ 37 కింద తనకు సమన్లు జారీ చేశారని కర్ణాటకకు చెందిన విఘ్నేశ్ ఈడీ సమక్షానికి వెళ్లే ముందు విలేకరులకు తెలిపారు. రాహుల్‌గాంధీ బ్రిటిష్ పౌరసత్వం వ్యవహారంలో సాక్ష్యాలు, పత్రాలు సమర్పించాల్సిందిగా ఈడీ విఘ్నేశ్‌ను ఆదేశించింది. ఈడీ అధికారులు ఫిర్యాదు దారుణ్ని ఈ వ్యవహారంలోని ఫెమా ఉల్లంఘనల్ని గురించిన ప్రశ్నలు అడిగారు. ‘‘నా దగ్గర కొన్ని కచ్చితమైన సాక్ష్యాలు, సమాచారం, పత్రాలు, రికార్డులు, వీడియోలు ఉన్నాయి’’ అని పిటిషనర్ విలేకరులకు తెలిపారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ