ముంబయి, దిల్లీ: తాను రాజీపడని జాతీయవాదినని నూతన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సి.పి.రాధాకృష్ణన్ చెప్పారు. మహారాష్ట్ర గవర్నర్‌గా ఉంటూ ఈ ఎన్నికల్లో పోటీచేసి విజేతగా నిలిచిన ఆయన బుధవారం ముంబయిలోని రాజ్‌భవన్‌లో సత్కారం అందుకున్నారు. గవర్నర్‌గా ఇక్కడ కొనసాగిన 13 నెలలు.. ప్రజాజీవితంలో తనకెంతో సంతోషకరమైన సమయమని, ఆ మధుర స్మృతులను దిల్లీకి తీసుకువెళ్తున్నానని ఆయన చెప్పారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక గాథల్ని మా తల్లి చెబుతుండేది. విదేశీ దురాక్రమణదారులపై శివాజీ పోరాడినట్లే దేశంలో అణచివేతపై అంబేడ్కర్ పోరు సాగించారు. అలాంటి దార్శనికుల వల్లనే ప్రజాస్వామ్య దేశంగా భారత్ మనుగడ సాగిస్తోంది. పాకిస్థాన్ మాత్రం ఆపసోపాలు పడింది. మహారాష్ట్ర గవర్నర్‌గా నేనున్న సమయంలోనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు తారుమారయ్యాయి. అయినా వారిమధ్య సుహృద్భావ సంబంధాలే ఉండటం రాజకీయ సంస్కృతికి నిదర్శనం. పరిపాలన పరంగా, రాజకీయంగా నాకెంతో నేర్పిన రాష్ట్రమిది’’ అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ