న్యూఢిల్లీ,11,సెప్టెంబర్ (హి.స.) పాకిస్థాన్ దౌత్యవేత్త (Pakistani Diplomat) అమీర్ జుబేర్ సిద్దిఖీకి చెన్నైలోని ఎన్‌ఐఏ (NIA) కోర్టు సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో భాగంగా అతడిని విచారణకు పిలిచింది. భారత్‌లోని అమెరికా, ఇజ్రాయెల్ కాన్సులేట్లపై దాడులకు కుట్రలు పన్నాడని ఆ సమన్లలో పేర్కొంది. కరాచీలోని అతడి చిరునామాను కూడా నోటీసుల్లో ప్రస్తావించింది.
రికార్డుల ప్రకారం.. సిద్దిఖీ (Amir Zubair Siddiqui) శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో వీసా కౌన్సిలర్‌గా చివరిగా విధులు నిర్వర్తించాడు. 2018లో ఎన్‌ఐఏ అతడిని వాంటెడ్ జాబితాలో చేర్చింది. ఫొటోను విడుదల చేసింది. అతడి నిక్‌నేమ్ బాస్ అని ఉంటుంది. దక్షిణ భారతదేశంలో 26/11 తరహా దాడులకు కుట్ర పన్నాడని పేర్కొంటూ అదే ఏడాది ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2009 నుంచి 2016 మధ్య శ్రీలంకలో పని చేస్తున్నప్పుడు గూఢచర్యం, ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనేవారితో సంబంధాలు నెరిపాడని ఎన్‌ఐఏ తన దర్యాప్తులో గుర్తించింది.
4.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ