ముంబయి,11, సెప్టెంబర్ (హి.స.) ఇథనాల్ కలిపిన ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన.
E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.
ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.
వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్‌ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్‌పై దాఖలైన PILను తిరస్కరించింది..
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ