జునాగఢ్: 11,సెప్టెంబర్ (హి.స.) ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యం అని కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం అన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు రాజ్యాంగ సంస్థలను రక్షించేందుకు కృషి చేయడం లేదని పేర్కొన్నారు. బిహార్‌లో ఓటరు జాబితా సవరణ చేపట్టిన విధంగానే దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ నిర్వహించేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల చోరీ ద్వారానే గుజరాత్‌లో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. దేశ ప్రజలకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని, ఓటు హక్కును అందించగా ఈ వ్యవస్థలను అధికార భాజపా నీరుగారుస్తోందని పేర్కొన్నారు.
గుజరాత్‌లోని జునాగఢ్‌లో కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుల కోసం సంఘటన్ సృజన్ అభియాన్ పేరిట 10 రోజుల శిక్షణ శిబిరాన్ని ఖర్గే ప్రారంభించారు. దానికి ముందు ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోరాడటం సాధారణమే. కానీ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా పార్టీ ప్రధాన ధ్యేయం. ప్రజలు అభిమానించే, దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్ వంటి మహనీయులు జన్మించిన నేల గుజరాత్. దేశం స్వేచ్ఛగా, ఐకమత్యంగా ఉండటానికి కారణమైన వారు సదా గౌరవనీయులు’’ అని ఖర్గే అన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉద్దేశిస్తూ వారికి ఈ దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ఇష్టం లేదన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ