న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.) రెగ్యులర్, ముందస్తు బెయిల్ పిటిషన్లపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం అన్ని హైకోర్టులకు సూచించింది. బెయిల్ పిటిషన్లను దీర్ఘకాలం పాటు పెండింగ్‌లో పెట్టడం న్యాయాన్ని నిరాకరించడం కిందకే వస్తుందని వ్యాఖ్యానించింది. దీనిపై అన్ని జిల్లా కోర్టులకు సూచనలు ఇవ్వాలని హైకోర్టులను ఆదేశించింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లను సంవత్సరాల తరబడి ‘అనిశ్చితి మేఘాల్లో’ ఉంచడం సరికాదని జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ ఆర్.మహదేవన్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. కేసులోని మెరిట్ ఆధారంగా త్వరగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అందువల్ల పిటిషన్ దాఖలయిన 2 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులపై దర్యాప్తు సంస్థలు కూడా త్వరగా విచారణలను ముగించాల్సి ఉంటుందని తెలిపింది. బెయిల్ పిటిషన్లు పేరుకుపోకుండా హైకోర్టులు తగిన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ