బెంగళూరు/న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.), సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో మళ్లీ సామాజిక, విద్య సర్వే (కులగణన)-2025 నిర్వహిస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. బెంగళూరులోని తన అధికారిక నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి అక్టోబరు 7వ తేదీ వరకు సర్వే కొనసాగుతుందని తెలిపారు. దీని కోసం రూ.420 కోట్లు కేటాయిస్తామన్నారు. 2015లో అప్పటి కమిషన్ అధ్యక్షుడు కాంతరాజ్ నివేదిక సమర్పించారని, ఆ సర్వే ముగిసి పదేళ్లు కావడంతో కొత్త సర్వే చేయించాలని తీర్మానించామని వెల్లడించారు. ఈ సర్వేను శాశ్వత బీసీ కమిషన్ పర్యవేక్షిస్తుందని చెప్పారు. ప్రజల సామాజిక స్థితిగతులను తెలుసుకునేందుకు వీలుగా సర్వే కోసం 60 ప్రశ్నలను రూపొందించారని వెల్లడించారు. ప్రతి ఒక్కరి సామాజిక, విద్య, రాజకీయ, ఆర్థిక స్థితిగతులు తెలిసినప్పుడు మాత్రమే సంక్షేమ పథకాలను సమగ్రంగా అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. సర్వే గణాంకాలు ఇందుకు దోహదపడతాయని తెలిపారు. గ్యారెంటీ పథకాల ద్వారా అసమానతలను కొంతమేర తగ్గించే ప్రయత్నం చేశామని చెప్పారు. బీసీ వర్గాలలో పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత తగ్గేందుకు ప్రత్యేక చర్యలు అవసరమని గుర్తించామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 7 కోట్ల ప్రజల సామాజిక, విద్య పరిస్థితులను తెలుసుకునేందుకు మధుసూదన నాయక్ అధ్యక్షతన కమిషన్ సర్వే చేస్తుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ