ఐజ్వాల్, 13 సెప్టెంబర్ (హి.స.) ఈశాన్య రాష్ట్రమైన మిజోరం అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌ను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే అత్యంత కీలకమైన బైరబీ-సైరంగ్ రైల్వే లైన్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రవ్యాప్తంగా రూ.9,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో, గువాహటి, అగర్తల, ఇటానగర్ తర్వాత రైలు మార్గంతో అనుసంధానమైన నాలుగో ఈశాన్య రాజధానిగా ఐజ్వాల్ నిలిచింది.
51.38 కిలోమీటర్ల పొడవైన ఈ రైల్వే ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ మూడు కొత్త రైళ్లను కూడా జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో సైరంగ్-ఆనంద్ విహార్ (ఢిల్లీ) రాజధాని ఎక్స్‌ప్రెస్ (వారానికి ఒకసారి), కోల్‌కతా-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (వారానికి మూడుసార్లు), గువాహటి-సైరంగ్ ఎక్స్‌ప్రెస్ (రోజువారీ) ఉన్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా మిజోరంలో పర్యాటకం, వాణిజ్యం గణనీయంగా పుంజుకోవడంతో పాటు స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును రూ.8,070 కోట్ల వ్యయంతో పూర్తి చేశామని తెలిపారు. 45 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలతో ఈ మార్గం నిర్మాణం అత్యంత సవాలుగా సాగిందని ఆయన వివరించారు. 2014కు ముందు ఈశాన్య రాష్ట్రాల రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.2,000 కోట్లు కేటాయిస్తే, తమ ప్రభుత్వం వచ్చాక ఆ నిధులను ఐదు రెట్లు పెంచిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.
రైల్వే ప్రాజెక్టుతో పాటు ప్రధాని పలు కీలక రహదారులకు కూడా శంకుస్థాపన చేశారు. ఐజ్వాల్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.500 కోట్లతో నిర్మించనున్న ఐజ్వాల్ బైపాస్ రోడ్, అలాగే తెన్జాల్–సియాల్‌సుక్, ఖాన్‌కాన్–రొంగురా రహదారుల పనులకు శ్రీకారం చుట్టారు. వీటితో పాటు, ఐజ్వాల్‌లోని మువాల్‌ఖాంగ్‌లో ఎల్‌పీజీ బాట్లింగ్ ప్లాంట్‌కు, క్రీడాభివృద్ధి కోసం ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ హాల్‌కు, రెండు రెసిడెన్షియల్ పాఠశాలలకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు మిజోరం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంలో కీలకపాత్ర పోషిస్తాయని ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి