లండన్: 14 సెప్టెంబర్ (హి.స.)బ్రిటన్‌లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతోంది అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది.
బ్రిటన్‌లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా వీడియోలో మాట్లాడుతూ.. ‘భారీగా, అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనమవుతోంది. వలసల కారణంగా హింస పెరిగిపోతోంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే.. పోరాడాల్సిందే. మన హక్కులు కాపాడుకోవాల్సిందే. పోరాడండి.. లేదంటే చనిపోతారు.. అని వారికి మద్దతు ఇచ్చారు. చివరగా.. బ్రిటన్‌లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నాను’ అని కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. శనివారం సెంట్రల్ లండన్‌లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ..‘మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక, ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్-రైట్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ నిర్వహించిన 'యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ