హైదరాబాద్, 14 సెప్టెంబర్ (హి.స.) ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి 200 రోజులు దాటినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయిందని మండిపడ్డారు. ఇంకా బాధిత కుటుంబాలకు ఎలాంటి పరిహారం చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్ఎల్బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్్న కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. వారి ప్రాణాలు బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ చేసిన ప్రతిదానితోపాటు ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు తాము సమాధానాలు రాబడతామని స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు