అమరావతి, 14 సెప్టెంబర్ (హి.స.): తురకపాలెంలో తీవ్ర అనారోగ్య సమస్యలకు యురేనియం అవశేషాలు కలిసిన జలాలే కారణమని అధికారుల సమగ్ర అధ్యయనంలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ గ్రామంలోని నీరు, మట్టి, స్థానికుల రక్త నమూనాలను సేకరించి చెన్నై సహా ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ ప్రయోగశాలలకు పంపించి అధ్యయనం చేయిస్తున్నారు. చెన్నై ప్రయోగశాలకు పంపిన నీటి నమూనాల ఫలితాలు శనివారం వెల్లడైనట్లు తెలిసింది. అందులో తురకపాలెం పరిసరాల్లోని నీటిలో యురేనియం అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. చుట్టూ రాళ్ల క్వారీలు ఉండడం, వాటిలోనే ఈ పరిసర ప్రాంతవాసులు పనిచేస్తుండటం.. ఇక్కడ క్వారీ గుంతల్లోని నీటిని పలు సందర్భాల్లో వాడడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. స్ట్రాన్షియం అనే మూలకంతో పాటు ఈకొలి బ్యాక్టీరియా కూడా ఇక్కడి నీటిలో ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు, తొలుత గ్రామంలో సేకరించిన నీటి నమూనాల పరీక్ష ఫలితాల్లో ఒక్కచోట మినహా ఎక్కడా బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని అధికారులు ప్రకటించారు. చెన్నై నివేదికలో మాత్రం అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ