హైదరాబాద్, 15 సెప్టెంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆదివారం రాత్రి తెలంగాణ రాజధాని నగరం అయిన హైదరాబాద్ లోని అనేక ప్రాంతాల్లో ఎవరూ ఊహించని స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కుండపోత వర్షం కురవడంతో నగరంలోని రోడ్లన్ని చెరువులను తలపించాయి. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నాలాలు ఉప్పొంగడంతో నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన హైడ్రా, జీహెచ్ఎమ్సీ సిబ్బంది వారిని వెతికే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనప్పటికి రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని అనేక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిన్న రాత్రి అత్యధికంగా ముషీరాబాద్లో 121 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవ్వగా.. అత్యల్పంగా అంబర్పేట 55.3 మిల్లీ మీటర్లు నమోదైంది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు