గుంటూరు, : 15 సెప్టెంబర్ (హి.స.) వరుసగా రెండో రోజూ(ఆదివారం) గుంటూరులో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3.30 నుంచి సుమారు గంటన్నరపాటు కుండపోతగా వాన కురవడంతో నగరమంతా నీట మునిగింది. శనివారం కురిసిన భారీ వర్షానికే చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఆదివారం కూడా కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనంపై మరింత ప్రభావం పడింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీలు నీట మునిగాయి. సెల్లార్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల్లోకి డ్రెయిన్లలోని నీరు ఉధృతంగా ప్రవహించడంతో కార్లు, ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి. బ్రాడీపేట, లక్ష్మీపురం ప్రాంతాల్లో చెట్లు కూలి కార్లపై పడ్డాయి. కంకరగుంట, మూడొంతెనల ఆర్‌యూబీల కింద భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. గుంటూరు రైల్వేస్టేషన్‌లోకి కూడా వరద నీరు చేరడంతో కొన్ని రైళ్లను ఆలస్యంగా నడిపారు. కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, మెడికల్ కాలేజ్, జీజీహెచ్, కలెక్టర్ నివాసంలోకి కూడా వరదనీరు ప్రవహించింది. వర్షం ఆగిన తర్వాత ఒక్కసారిగా వాహన చోదకులు రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ