ముంబై, 15 సెప్టెంబర్ (హి.స.)
దేశ ఆర్థిక రాజధాని ముంబైను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు నగరం జలమయం అయింది. రహదారులు చెరువులను తలపించడంతో ఉదయాన్నే ఉద్యోగాలకు వెళ్లే వారంతా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఇక పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇక రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే థానే, రాయ్డ్, బీడ్, అహల్యానగర్, పూణె, లాతూర్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక భారీ వర్షాలు కారణంగా ముంబైలో అంతరాయాలు ఏర్పడతాయని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ రోజంతా ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు రావొద్దని పేర్కొంది. లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ప్రజలు అనవసరమైన ప్రయాణాలను మానుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..