రాంచి, ఝార్ఖండ్ 15 సెప్టెంబర్ (హి.స.) వరుస ఎన్కౌంటర్లతో పెద్ద ఎత్తున క్యాడర్ను కోల్పోతున్న మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని హజారీబాగ్ లో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనాయకుడు సహా మరో ఇద్దరు మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున హజారీబాగ్ జిల్లాలోని గిర్ది-బొకారో సరిహద్దుల్లో మావోయిస్టులు ఉన్నారనే సమాచారతో కోబ్రా బెటాలియన్, స్థానిక పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఉదయం 6 గంటల సమయంలో కరండి గ్రామ సమీపంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసు బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ లీడర్ సహదేవ్ సోరెన్, జోనల్ కమిటీ సభ్యుడు బిర్సేన్ గంఝూ అలియాస్ రామ్ ఖేలవాన్, బీహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీ సభ్యుడు రఘునాథ్ హెబ్రామ్ అలియాస్ చంచల్ మరణించారని పోలీసులు తెలిపారు.
సహదేవ్ సోరెన్పై రూ.కోటి, మిగిలిన ఇద్దరు నేతలపై రూ.25 లక్షల చొప్పున రివార్డు ఉన్నదని వెల్లడించారు. ఎన్ కౌంటర్ అనంతరం ముగ్గురి మృతదేహాలను స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా గాలింపు కొనసాగుతున్నదని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..