ముంబయి,15, సెప్టెంబర్ (హి.స.)ఏనుగుల తరలింపు వ్యవహారంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) స్థాపించిన వంతారా (Vantara) సంస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. నిబంధనలకు అనుగుణంగా వంతారాకు ఏనుగుల (Elephants)ను తరలిస్తే.. అందులో ఏ తప్పూ లేదని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. గుజరాత్‌లోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా(పిఐఎల్)న్ని విచారిస్తూ.. ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ విషయంపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా వంతారాకు క్లీన్‌చిట్ ఇచ్చినట్లు జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. వంతారాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈవిషయంపై వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో బందీలుగా ఉన్న ఏనుగులను వాటి యజమానులకు తిరిగి ఇవ్వడానికి పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ సి.ఆర్. జయసుకిన్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ అస్పష్టమైనదిగా పేర్కొంటూ.. అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ