ఢిల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)ఆసియా కప్ 2025లో టీమిండియా పాకిస్థాన్‌ను ఓడించడమే కాకుండా, వారిని బహిరంగంగా అవమానించింది. పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించడం ద్వారా టీమిండియా తగిన శాస్తి చేసింది. టాస్ సమయంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఇలాగే చేశాడు. ఆ తర్వాత, మ్యాచ్ గెలిచినప్పుడు కూడా భారత ఆటగాళ్లు పాక్ జట్టును పట్టించుకోలేదు. భారత జట్టులోని ఏ ఒక్క సభ్యుడు కూడా వారితో కరచాలనం చేయలేదు. పాక్ ఆటగాళ్లు స్వయంగా వారితో కరచాలనం చేయడానికి అసహనంతో కనిపించారు. ఇప్పుడు భారత ఆటగాళ్లు కరచాలనం చేయకపోవడంపై దుమారం చెలరేగుతోంది. ఈ విషయంలో పాక్ క్రికెట్ జట్టు కూడా టీమిండియాపై చర్యలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
భారత జట్టు కరచాలనం చేయకపోవడంతో కలత చెందిన పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్, పీసీబీ ఆదేశం మేరకు భారత జట్టుపై ఫిర్యాదు చేశారు. పీటీఐ ప్రకారం, జట్టు మేనేజర్ నవీద్ అక్తర్ చీమా టీమిండియా అనుచిత ప్రవర్తనకు సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ముందు తమ గోడు వెల్లబోసుకున్నాడు.
అంతకుముందు, సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ పై తన విజయాన్ని పహల్గామ్ ఉగ్రవాద దాడిలో మరణించిన అమాయక ప్రజలకు అంకితం చేశాడు. పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయవద్దని భారత జట్టు ఉన్నతాధికారులు కఠినంగా ఆదేశించారని సమాచారం. జట్టులోని ఆటగాళ్లందరూ కూడా అదే పాటించారు. అందిన సమాచారం ప్రకారం, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు దీని గురించి అరగంట సమావేశం కూడా జరిగింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి