ముంబై, 16 సెప్టెంబర్ (హి.స.)
ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడానికి చివరి తేదీని ఆదాయపు పన్ను శాఖ సెప్టెంబర్ 16 (నేడు) వరకు పొడిగించింది. ఇది వరకు సెప్టెంబర్ 15 వరకే అవకాశం ఉండేది. 2025-26 సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీని సెప్టెంబర్ 15, 2025 నుండి సెప్టెంబర్ 16, 2025 వరకు పొడిగిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఒక ప్రకటనలో తెలిపింది.
ఐటీఆర్ దాఖలుకు సోమవారమే చివరి తేదీ. అయితే, గడువు ముగుస్తుండటంతో చివరి నిమిషంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు ఒకేసారి ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోర్టల్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి, పలు సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల సౌలభ్యం కోసం సీబీడీటీ గడువును ఒక రోజు పెంచింది. కొత్త ఐటీఆర్ దాఖలు గడువు తేదీని అసలు గడువుకు కొన్ని నిమిషాల ముందు ప్రకటించింది.
సోమవారం సాయంత్రం నాటికి రికార్డు స్థాయిలో దాఖలు అయ్యాయి. 7 కోట్లకు పైగా ఐటీ రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ నివేదించింది. అయితే వినియోగదారులు ఐటీ శాఖకు చెందిన ఈ-ఫైలింగ్ పోర్టల్, ముందస్తు పన్ను చెల్లింపు వ్యవస్థతో సాంకేతిక సమస్యలను నివేదించారు. వీటిలో ఇప్పటికే 6.03 కోట్ల రిటర్నులను అధికారులు వెరిఫై చేయగా, 4 కోట్ల ఐటీఆర్‌ల ప్రాసెసింగ్‌ను కూడా పూర్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి