రాంచీ, 16 సెప్టెంబర్ (హి.స.)భారత దేశం నదులకు పుట్టినిల్లుగా పిలుస్తారు..అంతేకాదు.. నదిని మన దేశంలో నదీమ తల్లిగా పూజిస్తారు. దేశవ్యాప్తంగా నదులు, వాటి ఉపనదులతో కలిపి 400కు పైగా ప్రవహిస్తున్నాయి. ఇకపోతే, ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకతతో పాటు ఓ చరిత్ర కూడా ఉంది. అటువంటి ముఖ్యమైన నదులలో స్వర్ణరేఖ నది ఒకటి. దీనినే గోల్డెన్ రివర్ అని కూడా అంటారు. ఈ నదిలో నీళ్లతో పాటు బంగారం కూడా ప్రవహిస్తుందని మీకు తెలుసా..? అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. భారతదేశంలోని ఈ నదిలో కోట్ల విలువైన బంగారు నిక్షేపాలు ఉన్నాయి. నీటిలో బంగారం ప్రవహిస్తుంది. రోజూ అక్కడి ప్రజలు బంగారం కోసం నీటిని జల్లెడ పడుతుంటారు.
స్వర్ణరేఖ నది లేదా గోల్డెన్ రివర్..ఇది జార్ఖండ్ రాజధాని రాంచీకి సమీపంలో పుట్టి, జార్ఖండ్‌లో ప్రవహిస్తుంది. ఇక్కడ నివసించే స్థానిక ప్రజలకు ఈ నది ముఖ్యమైన ఆదాయ వనరు. ఎందుకంటే.. ఇక్కడి ప్రజలు ప్రతిరోజూ నది ఒడ్డుకు వెళ్లి నీటిని ఫిల్టర్ చేసి బంగారం సేకరిస్తుంటారు.. స్వర్ణ రేఖ నది మూలం జార్ఖండ్ రాజధాని రాంచీ నుండి 16 కి.మీ. దూరంగా ఉంది. ఈ నది జార్ఖండ్‌లో పుట్టి పశ్చిమ బెంగాల్, ఒడిశా మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ఈ నదికి ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే జార్ఖండ్ నుండి ప్రవహించిన ఈ నది మరే ఇతర నదిలో కలవకుండా నేరుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కిలోమిటర్ల దూరం ప్రయాణించి ఒరిస్సా దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. వందేళ్ల తర్వాత కూడా ఈ నదిలో బంగారం ఎందుకు ప్రవహిస్తుందో శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నదిలోని బంగారం ఎక్కడి నుండి వస్తుందనేది నేటికి అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిందని చెబుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి