అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.) రాష్ట్రంలో యూరియా కొరత లేనేలేదని సీఎం చంద్రబాబు తేల్చిచెప్పారు. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. అధికార పగ్గాలు చేపట్టాక అన్ని శాఖల్లోనూ అనుసరించాల్సిన విధానపరమైన మార్పులపై స్పష్టత ఇచ్చానని.. కానీ యూరియా విషయంలో అధికారులు తమ పంథా మార్చుకోలేదని అసహనం వ్యక్తంచేశారు. సోమవారం కలెక్టర్ల సదస్సులో ఆయనీ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. అన్ని శాఖలూ గాడిలో పడ్డాయని.. యూరియా సరఫరాపై మాత్రం ముందస్తు ప్రణాళికలు, చర్యలు అమలు చేయకపోవడం వల్ల సమస్యలొచ్చాయని చెప్పారు. యూరియా వినియోగాన్ని తగ్గించేందుకు కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని.. రైతుల్లో అవగాహన పెంచాలని సూచించారు. ‘యూరియా వాడని రైతులకు బస్తాకు రూ.800 చొప్పున ప్రోత్సాహకం ఇస్తాం. పీఎం ప్రణామ్ కింద రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీని రైతులకు ఇచ్చేద్దాం. విధివిధానాలను త్వరలో ప్రకటిస్తాం. రబీ నుంచి ఈ-క్రాప్ విధానం తప్పకుండా అమలు కావాలి. ఈ విధానం ద్వారా ఇప్పటి నుంచే ఎవరెవరు.. ఎంతెంత పంట వేస్తున్నారో గుర్తించి.. అవసరమైన యూరియాను సరఫరా చేద్దాం’ అని చెప్పారు. ప్రజలు తినే రకాలనే పండించేలా రైతుల్లో అవగాహన కల్పించాలని.. డిమాండ్-సరఫరాకు తగిన పంటలు పండించేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ