న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.) అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ(ఏఐ)ను అందిపుచ్చుకోవడం పెరుగుతున్నందున 2035 కల్లా భారత జీడీపీకి అదనంగా 500-600 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.44-52 లక్షల కోట్ల) మేర జత అవుతుందని నీతి ఆయోగ్ నివేదిక అంచనా వేస్తోంది. ఏఐ వల్ల ఉత్పాదకత, సిబ్బంది సామర్థ్యం పెరగడం ఇందుకు దోహదం చేస్తుందని అభిప్రాయపడింది. వచ్చే పదేళ్లలో ఏఐ అన్ని విభాగాల్లోనూ దూసుకెళ్లడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 17-26 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.1496-2288 లక్షల కోట్లు) అదనంగా చేరతాయని అంచనా వేసింది.
అంతర్జాతీయ ఏఐ విలువలో భారత్ 10-15% వాటాను అందిపుచ్చుకునేందుకు అవకాశాలున్నాయి. ఏఐ వల్ల పలు కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అయితే క్లరికల్, సాధారణ, తక్కువ నైపుణ్యం ఉండే విభాగాలు మాయం కావొచ్చు. ఆర్థిక సేవలు, తయారీపై ఏఐ ప్రభావం ఎక్కువగా ఉంది. జీడీపీలో ఇవి 20-25% వాటాను అందుకోవచ్చు. ఏఐ కారణంగా ఆర్థిక సేవలు 50-55 బిలియన్ డాలర్ల విలువకు చేరుకోవచ్చు. ప్రస్తుత అంచనా (2035పై) కంటే ఇది అధికం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ