కేరళను వణికిస్తున్న 'మెదడును తినే అమీబా'.. ఈ ఏడాది 18 మంది మృతి!
కోచ్చిన్, 16 సెప్టెంబర్ (హి.స.) ''అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్'' అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతోంది. ''మెదడును తినే అమీబా''గా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిరువనంతపురానికి చె
brain-eating-amoeba-claims-18-lives-in-kerala#goog_rewarded


కోచ్చిన్, 16 సెప్టెంబర్ (హి.స.)

'అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్' అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కేరళలో కలకలం రేపుతోంది. 'మెదడును తినే అమీబా'గా పిలిచే ఈ వ్యాధి కారణంగా మరణాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా తిరువనంతపురానికి చెందిన 17 ఏళ్ల టీనేజర్‌కు ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు అధికారులు ధ్రువీకరించారు. దీంతో ఈ ఏడాది ఈ వ్యాధి బారిన పడి మరణించిన వారి సంఖ్య 18కి చేరింది.

తాజా కేసు విషయానికి వస్తే, బాధిత కుర్రాడు తన స్నేహితులతో కలిసి అక్కూలం టూరిస్ట్ విలేజ్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశాడు. ఆ మరుసటి రోజే అతడికి వ్యాధి లక్షణాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్‌ను మూసివేసి, నీటి నమూనాలను పరీక్షల నిమిత్తం సేకరించారు.

ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ ఏడాది కేరళలో మొత్తం 67 కేసులు నమోదు కాగా, వారిలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలే మలప్పురం జిల్లాకు చెందిన శోభన (56), సుల్తాన్ బతేరికి చెందిన రతీష్ (45) అనే ఇద్దరు వ్యక్తులు కూడా ఇదే వ్యాధితో చికిత్స పొందుతూ కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మరణించారు. వరుస మరణాల నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.

ప్రజలకు ఆరోగ్య శాఖ మంత్రి హెచ్చరిక

ఈ అంశంపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిల్వ ఉన్న నీటిలో, మురికి నీటిలో, పశువులు స్నానం చేసే జలాశయాల్లో ముఖం కడుక్కోవడం గానీ, స్నానం చేయడం గానీ చేయవద్దు. బావుల్లో శాస్త్రీయంగా క్లోరినేషన్ చేయాలి. వాటర్ థీమ్ పార్కులలోని స్విమ్మింగ్ పూల్స్‌లో సరైన మోతాదులో క్లోరిన్ కలపాలి అని సూచించారు. ఈ అమీబా ముక్కు ద్వారానే మెదడులోకి ప్రవేశిస్తుందని, కాబట్టి స్నానం చేసేటప్పుడు ముక్కులోకి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని మంత్రి హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande