ముంబయి,16, సెప్టెంబర్ (హి.స.) దేశీయ మార్కెట్లు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి (Stock Market Today). అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నడుమ మన సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. వడ్డీ రేట్లకు సంబంధించి అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈనెల 17న నిర్ణయం ప్రకటించనుంది. రేట్ల కోత అంచనాలు, కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు నేటి ట్రేడింగ్‌లో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసింది. ఉదయం 9.39 గంటల సమయంలో సెన్సెక్స్ 224 పాయింట్ల లాభంతో 82,028 వద్ద ఉండగా.. నిఫ్టీ 70 పాయింట్లు పుంజుకొని 251 వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 88.05గా ఉంది.
నిఫ్టీ సూచీలో కొటక్ మహీంద్రా, హీరో మోటార్‌కార్ప్, బజాజ్ ఫిన్‌సర్వ్, లార్సెన్, అపోలో హాస్పిటల్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టైటాన్ కంపెనీ, ఆసియన్ పెయింట్స్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సోమవారం అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగియగా.. ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్ మినహా మిగతా సూచీలన్నీ లాభాల బాటలో పయనిస్తున్నాయి. ఇదిలాఉంటే.. మంగళవారం బంగారం ధర రికార్డు స్థాయిని తాకింది. ఫెడ్ రేట్ల కోత అంచనాలతో డాలర్ బలహీనపడింది. అది పుత్తడి దూకుడుకు దోహదం చేసింది. దాంతో స్పాట్ గోల్డ్ ఔన్సు ధర ఒక దశలో 3,689.27 డాలర్లకు చేరింది. ప్రస్తుతం 3,681 డాలర్ల వద్ద కదలాడుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ