అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.) విజయవాడలోని ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం దసరా ఉత్సవలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానుంది. ఇక, సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సంబరాలకు 20 లక్షల మందికి పైగా భక్తులు వస్తారు అని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీ శక్తి పథకంతో ఉచిత బస్సులు ఉండడంతో ఈసారి మహిళా భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉంది. అలాగే, వీఐపీ, వీవీఐపీ భక్తులు వారికి కేటాయించిన సమయంలో మాత్రమే రావాలి.. దసరాతో పాటు అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో వీఐపీ భక్తుల తాకిడి అధికంగా ఉండే ఛాన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరికి అధికారులు సూచనలు చేస్తున్నారు.
అయితే, ఈ సారి తిధుల ప్రకారం 11 రోజుల పాటు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. ప్రతి సంవత్సరం పది అవతారలలో దర్శనం ఇచ్చిన అమ్మ వారు ఈ సంవత్సరం 11వ ప్రత్యేక అవతారం కాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు.. ఈసారి సామాన్య భక్తులకే పెద్ద పీట వేస్తామంటున్నారు. వీఐపీ, వీవీఐపీ భక్తులకు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కేటాయిస్తామని అన్నారు. ఈ దసరా ఉత్సవాలకు రూ. 500 టికెట్స్ రద్దు చేయగా కేవలం రూ. 300, రూ. 100 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ఇక, అమ్మ వారి భక్తులకు అన్నదానం, ప్రసాదం పంపిణీ కూడా నిత్యం జరుగుతాయని ఆలయ అధికారులు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు, గర్భిణీలకు సాయంత్రం 4 గంటలకు దర్శనం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. క్లూ లైన్ లో వాటర్ బాటిల్స్, బిస్కెట్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేయనున్నారు. అలాగే, 5000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్త్ నిర్వహించనున్నారు. ఇక, 500 సీసీ కెమెరాలు, 25 డ్రోన్స్ తో దసరా ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు 12 చోట్ల పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ