న్యూయార్క్, /న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబరు 20: ‘‘మోదీ అత్యంత బలహీన ప్రధాని’’ అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల రుసుము విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న అనంతరం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017లో ప్రధానిని బలహీనుడు అంటూ చేసిన పోస్టునే తిరిగి ‘ఎక్స్’లో రాహుల్ గాంధీ పోస్టు చేశారు. విదేశాల్లో భారతీయుల ఆకాంక్షలను నిలబెట్టలేకపోతున్నారని దుయ్యబట్టారు. దీంతోపాటు హెచ్-1బీ వీసా నిర్ణయంపై వచ్చిన కథనాన్ని ఆయన ఈ పోస్టుకు జత చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా మోదీపై విమర్శల వర్షం కురిపించారు. ‘‘మీ ప్రియ మిత్రుడి (ట్రంప్) నుంచి అందిన పుట్టిన రోజు రిటర్న్ గిఫ్ట్ (హెచ్-1బీ వీసా రుసుము) చూశాక భారతీయులు చాలా బాధ పడ్డారు’’ అని ఖర్గే వ్యాఖ్యానించారు.కాగా, హెచ్-1బీ వీసాల రుసుమును లక్ష డాలర్లకు పెంచేయడంతో అమెరికా ఆవిష్కరణల రంగాన్ని స్వయంగా ఆ దేశ ప్రభుత్వమే గొంతు నొక్కినట్లైందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. ‘ప్రపంచ దేశాల్లోని ప్రతిభ తమ దేశంలోకి రాకుండా అమెరికా తలుపులు మూసుకుంది. తద్వారా వచ్చేతరం ల్యాబ్‌లు, పేటెంట్లు, ఆవిష్కరణలు, స్టార్ట్‌పలను హైదరాబాద్, బెంగళూరు, పుణె, గుర్గావ్‌లకు మళ్లించింది. అమెరికా నష్టం.. భారత్‌కు లాభం’ అంటూ ఎక్స్‌లో అమితాబ్ కాంత్ పోస్టు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ