తెలంగాణ, సూర్యాపేట. 21 సెప్టెంబర్ (హి.స.)
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రేపు ఢిల్లీ వెళ్లి ఆల్మట్టి డ్యాంపై వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన ఆయన..పాలకవీడు మండలం జవహర్ జాన్ పహాడ్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బీఆర్ఎస్ పాలనలో కూలిపోయే కాళేశ్వం కట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుగుతోందని, విచారణ తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతామని చెప్పారు. కాగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఇదే జరిగితే తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసినట్టేనని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు