హుజురాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)
బతుకుదెరువు కోసం డీజే ఆపరేటర్గా పనిచేస్తున్న ఓ యువకుడిని పోలీసులు అడ్డగించి, దాడి చేయడం తీవ్ర మనస్తాపం కలిగించింది. తన జీవనోపాధిని పోలీసులు దెబ్బతీశారని ఆరోపిస్తూ ఆ యువకుడు సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. ఈ ఘటన హుజురాబాద్ పట్టణంలో కాసేపు కలకలం రేపింది.
ఘటన వివరాలు...
మామిళ్లవాడకు చెందిన శ్రీనివాస్ అనే యువకుడు దళితబంధులో డీజే కొనుగోలు చేసుకొని ఆపరేటర్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక మార్కెట్ ఏరియాలో దుర్గామాత ఉత్సవాలకు డీజే ఏర్పాటు చేయగా పోలీసులు అడ్డుకున్నారని, తన డీజే సామగ్రిని లాక్కొని, తనపై దాడి చేశారని శ్రీనివాస్ ఆరోపించాడు. దీనిపై మనస్తాపం చెందిన శ్రీనివాస్, హుజురాబాద్ తాహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న రిలయన్స్ సెల్ టవర్పైకి ఎక్కాడు. తాను డీజే పెట్టనని చెప్పినా తన సామగ్రిని లాక్కొని వెళ్లారని, తనను తీవ్రంగా కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు.
దాదాపు గంటపాటు టవర్పై ఉండి నిరసన తెలియజేసిన శ్రీనివాస్ తో పోలీసులు మాట్లాడారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శ్రీనివాస్ టవర్ నుండి దిగివచ్చాడు. ఈ సంఘటనతో పట్టణంలో కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..