హైదరాబాద్, 21 సెప్టెంబర్ (హి.స.)గాజులరామారం పరిధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ సర్వే నంబర్ 307లో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా అధికారులు, సిబ్బందిపై స్థానికులు తీవ్ర ప్రతిఘటనకు దిగారు. దేవేంద్ర నగర్, బాలయ్య నగర్, హబీబ్ నగర్ కాలనీల్లో కూల్చివేత చర్యలు కొనసాగుతున్న సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హబీబ్ నగర్‌లో కూల్చివేతలకు వచ్చిన అధికారుల బృందం, జెసిబీలపై బస్తీ వాసులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బందోబస్తు కోసం అక్కడికి చేరిన పోలీసులు కూడా గాయపడ్డారు. జెసిబీల అద్దాలు పగిలిపోయాయి. ఉద్రిక్తత పెరగడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై, దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కూల్చివేతలపై స్థానికుల అసంతృప్తి, అధికారుల చర్యలు, రాళ్ల దాడి కలిపి గాజులరామారం పరిధి ఉద్రిక్త వాతావరణంలో మునిగిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు