విజయవాడ, 21 సెప్టెంబర్ (హి.స.)తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయాలు దసరా నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్నాయి. రేపటి నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయి.. అక్టోబర్ 2వ తేదీ వరకూ జరగనున్నాయి. అయితే ఈ ఏడాది నవరాత్రులు 9 రోజులు కాదు.. 10 రోజులు జరుపుకోనున్నారు. ఈ నేపధ్యంలో విజయదశమితో కలిపి మొత్తం 11 రోజులు దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి కూడా దసరా ఉత్సవాలకు అందంగా ముస్తాబైంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు వైభవంగా జరగనున్నాయి. 11 రోజుల పాటు కనక దుర్గ 11 అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారని దుర్గగుడి ఈవో శినా నాయక్ వెల్లడించారు. అమ్మవారి అలంకరణల షెడ్యుల్ ను రిలీజ్ చేశారు.
ఏ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనం ఇస్తారంటే
సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు: బాలత్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 23 నవరాత్రి రెండవ రోజు: గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 నవరాత్రి మూడవ రోజు: అన్నపూర్ణాదేవి
సెప్టెంబర్ 25 నవరాత్రి నాలుగవ రోజు: కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 నవరాత్రి ఐదో రోజు: మహాలక్ష్మి దేవి
సెప్టెంబర్ 27 నవరాత్రి ఆరో రోజు: లలితా త్రిపుర సుందరి దేవి
సెప్టెంబర్ 28 నవరాత్రి ఏడో రోజు: మహాచండి దేవి
సెప్టెంబర్ 29 నవరాత్రి ఎనిమిదో రోజు: సరస్వతి దేవి
సెప్టెంబర్ 30 నవరాత్రి తొమ్మిదో రోజు: దుర్గాదేవి
అక్టోబర్ 1 నవరాత్రి 10వ రోజు: మహిషాసురమర్దిని దేవి
అక్టోబర్ 2 వ తేదీ విజయ దశమి : రాజరాజేశ్వరి దేవి
ఈ దసరా ఉత్సవాలు అక్టోబర్ 2 ఉదయం 9:30 గంటలకు పూర్ణాహుతితో ముగియనున్నాయి. అదే రోజు సాయంత్రం 5 గంటలకు కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుంది. సెప్టెంబర్ 29న అమ్మవారి నక్షత్రం అయిన మూలనక్షత్రం రోజున మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 మధ్య సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. భారీ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి