అమరావతి, 21 సెప్టెంబర్ (హి.స.)భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైన ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్‌పై ఏపీ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయనను అభినందిస్తూ ఈ రోజు ఎక్స్ వేదికగా సందేశం ఇచ్చారు.
ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ పురస్కారానికి ఎంపిక కావడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేసిన పవన్ కల్యాణ్, అభినయంలో సహజత్వానికి ప్రాధాన్యం ఇచ్చే నటుడని కొనియాడారు. కథానాయకుడిగా విభిన్న పాత్రలు పోషించి, 5 జాతీయ అవార్డులు పొందారని గుర్తు చేశారు.
తెలుగులో ఆయన నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ, అనువాద చిత్రాల ద్వారా మన ప్రేక్షకులను మెప్పించారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఇద్దరు, కంపెనీ, తెలుగు చిత్రం జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలు తెలుగు వారికి బాగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. మోహన్ లాల్ మరిన్ని విభిన్న పాత్రలు పోషించాలని ఆకాంక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి