న్యూఢిల్లీ,21,సెప్టెంబర్ (హి.స.)
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేల్చిన బాంబుతో అమెరికాలోని విమానాశ్రయాల్లో శుక్రవారం ఒక్కసారిగా కలకలం రేగింది. చాలామంది తమ ప్రయాణాలను అప్పటికప్పుడు రద్దు చేసుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి దసరా, దీపావళి పండుగలు జరుపుకునేందుకు, ఇతర పనుల మీద స్వదేశానికి వచ్చే ప్రణాళికల్లో ఉన్న భారతీయులు కూడా తమ ప్రయాణాలను వెంటనే రద్దు చేసుకున్నారు. మరోపక్క, అమెరికా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన హెచ్-1బీ వీసాదారులు కూడా తిరిగి అమెరికాకు పరుగులు పెడుతున్నారు. హెచ్-1బీ వీసా రుసుము లక్ష డాల్లరకు పెంపు నిర్ణయం సెప్టెంబరు 21 అర్ధరాత్రి తర్వాత నుంచి అమలు కానుండడమే ఇందుకు కారణం. కాగా, శాన్‌ఫ్రాన్సి్‌సకో విమానాశ్రయంలో ఓ ఎమిరేట్స్ విమానంలో ఎక్కి కూర్చున్న ప్రయాణికుల్లో హెచ్-1బీ వీసాదారులు ట్రంప్ ప్రకటన తెలుసుకుని హుటాహుటిన విమానం దిగిపోయారంటూ మసూద్ రాణా అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశాడు. శాన్‌ఫ్రాన్సి్‌సకో విమానాశ్రయం నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న ఓ విమానంలో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయులు తాము విమానం దిగిపోతామంటూ సిబ్బందిని వేడుకోవడం తనను బాధపెట్టిందంటూ మరో వ్యక్తి ఎక్స్‌లో పోస్టు చేశారు. మరోపక్క, భారత్ నుంచి అమెరికాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసుల టికెట్ల ధరలు కూడా శనివారం ఒక్కసారిగా పెరిగిపోయాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ