హైదరాబాద్, 24 సెప్టెంబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించడం సరికాదంటూ దాఖలైన పిటిషన్ ను కొట్టివేసింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏదైనా ఆర్డర్ ఇచ్చిందా? ఏ ఆధారంగా ఈ పిటిషన్ వేశారని హైకోర్టు సీరియస్ అయింది. పిటిషన్పై ఇవాళ జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టగా పిటిషనర్పై న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ పేపర్లలో వచ్చిన కథనాల ఆధారంగా పిటిషన్లు వేయడం ఏంటని మండిపడ్డారు. మీడియా వార్తల ఆధారంగా పిటిషన్లు వేయడం సరికాదని పిటిషనకు చురకలు అంటించారు.
ప్రభుత్వానికి ఊరట:
బీసీ రిజర్వేషన్లను కేటాయించాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారుపై తుది కసరత్తు చేస్తోంది. ఇవాళ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటువంటి తరుణంలో బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోతోందనే చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపింది. కానీ హైకోర్టు ఈ పిటిషన్ ను కొట్టివేయడంతో బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ముందడుగు వేసేందుకు ఈ నిర్ణయం ఊరటగా మారిందనే చర్చ జరుగుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు