ఒంటిమిట్ట, , 25 సెప్టెంబర్ (హి.స.): శ్రీరామచంద్రమూర్తి పాదస్పర్శతో పునీతమైన ఒంటిమిట్టను జాతీయ పర్యాటక, ఆధ్యాతిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తితిదే నియమించిన నిపుణుల బృంద సభ్యులు ప్రతిపాదించారు. భక్తుల మది దోచేలా చెరువు మధ్యలో ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నివేదించారు. రామయ్య క్షేత్రం చెంత ఉన్న తటాకం జలాల మధ్యలో 600 అడుగులు ఎత్తుతో ఆకర్షణీయంగా నిర్మించాలని కొత్త బృహత్తర ప్రణాళికలో ప్రతిపాదించారు. విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు ఇటీవల తితిదే ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను సమర్పించారు. రానున్న 30 ఏళ్లలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కసరత్తు చేశారు. కడప-రేణిగుంట జాతీయ రహదారి, చెన్నై-ముంబయి రైలు మార్గం మధ్యలో చెరువు ఉంది. అందులో రాములోరి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి దర్శన భాగ్యం కోసం వస్తున్న పర్యాటకుల మోము మురిసిపోయేలా ఈ ప్రాంతాన్ని సుందరంగా అభివృద్ధి చేయాలని ప్రస్తావించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒంటిమిట్ట రూపురేఖలు మార్చేలా ప్రణాళిక రూపొందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ