హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
గ్రూప్-1 తుది ఫలితాలను (Group 1 Results) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బుధవారం రాత్రి 12 గంటల తరువాత విడుదల చేసింది. మొత్తం 563కుగాను 562 గ్రూప్-1 సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం, ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణుల జాబితాను తమ వెబ్సైట్లో ప్రచురించింది. తుది ఎంపికలో మల్టీజోన్-1లో 258, మల్టీజోన్-2లో 304 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది. న్యాయవివాదం నేపథ్యంలో మరొక పోస్టును వితాల్డ్లో పెట్టింది. ఈ ఫలితాలు హైకోర్టులో విచారణలో కేసులపై వెలువడే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
కాగా, గ్రూప్-1లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీవో పోస్టులు ఎంపిక చేసుకున్నారని టీజీపీఎస్సీ వెల్లడించింది. టాప్-10 ర్యాంకులను వరుసగా లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి సాధించారని తెలిపింది.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..