హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన
హామీలను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వం తీసుకున్న ప్రీ ప్రైమరీ స్కూల్ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాళ అంగన్వాడీ టీచర్లు చలో సెక్రటేరియట్కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే వారు సెక్రటేరియట్ ముట్టడికి వెళ్లగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే అంగన్వాడీల అరెస్ట్ను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'X' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. తమ సమస్యల పరిష్కారం కోసం చలో సెక్రెటేరియట్కు పిలుపునిచ్చిన అంగన్వాడీల పట్ల ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి, కర్కషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. మహిళలను కోటీశ్వరులుగా చేస్తామంటూ బీరాలు పలికిన రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో వారిని ఎక్కడిక్కడ అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం సిగ్గుచేటన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళా ఉద్యోగులకు గౌరవం లేదా.. గుర్తింపు లేదా? ప్రజా పాలన అని రాక్షస పాలన కొనసాగిస్తారా అని ప్రశ్నించారు. ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ సంబురం లేకుండా చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి వారి ఉసురు తగులుతుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు