అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)
, అమరావతి: మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన 15,941 మంది అభ్యర్థులకు గురువారం అమరావతిలో నియామక ఉత్తర్వులు అందిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేశారని.. అందుకే ఇది ప్రభుత్వ తొలి విజయమని వివరించారు. బుధవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉద్యోగం పొందిన వారితోపాటు ఆ కుటుంబం నుంచి మరొకరు కలిసి మొత్తం 32 వేల మంది పాల్గొంటారు. ప్రతి జిల్లాకు ఒక జోన్ ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరుకావాలి. కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న మీ ప్రాంతాల్లోని ఉపాధ్యాయులతో అనుసంధానమయ్యేందుకు ఇది మంచి అవకాశం’ అని చెప్పారు. ‘ఎప్పుడు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినా రకరకాల అభ్యంతరాలు వచ్చేవి. వైకాపా నేతలు 106 కేసులు వేసి ఆపాలని చూశారు. పకడ్బందీగా నోటిఫికేషన్ ఇచ్చాం. ఒక్క స్టే కూడా రాలేదు. పారదర్శకంగా నిర్వహించాం’ అని తెలిపారు. ‘వైకాపా ఎమ్మెల్యేలతోపాటు పులివెందుల ఎమ్మెల్యేకు కూడా సాధారణ పరిపాలనశాఖ ద్వారా ఆహ్వానాలు పంపాం. కార్యక్రమంలో పాల్గొనాలని శాసనసభ ద్వారా ఆహ్వానిస్తున్నాం’ అని చెప్పారు. వైరివర్గం వారు కూడా అభినందించే రీతిలో మెగా డీఎస్సీ నిర్వహించారని.. ప్రతిపక్షంలోని వారు కూడా అభినందిస్తున్నారని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
భద్రతా ఏర్పాట్లపై పోలీసులకు సూచనలిస్తున్న ఎస్పీ వకుల్ జిందాల్
ఈ పరీక్షల నుంచే ఎస్సీ వర్గీకరణ, క్రీడా కోటా అమలు: రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కేవలం 150 రోజుల్లో మెగా డీఎస్సీని కూటమి ప్రభుత్వం పూర్తిచేసింది. ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించింది. అన్ని స్థాయిల్లోనూ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి, ఫిర్యాదులను పరిష్కరించింది. ఎస్సీ వర్గీకరణ చట్టం చేసిన తర్వాత మొదటిసారి డీఎస్సీలోనే రిజర్వేషన్లను అమలు చేశారు. క్రీడా కోటా 3% అమలు చేసి, ఎలాంటి పరీక్ష రాయాల్సిన అవసరం లేకుండానే క్రీడా సర్టిఫికెట్ల ఆధారంగా 372 మంది క్రీడాకారులకు టీచర్ ఉద్యోగాలు లభించాయి. ఉమ్మడి ఏపీ నుంచి ఇప్పటివరకు ఒకసారి పరిశీలిస్తే డీఎస్సీల ఛాంపియన్‌గా సీఎం చంద్రబాబు నిలుస్తారు. 1994 నుంచి 2025 వరకు 14 డీఎస్సీలను ప్రకటించి, 1,96,619 టీచర్ పోస్టులను భర్తీ చేశారు. మెగా డీఎస్సీలో 16,347 పోస్టులకు ప్రకటన ఇవ్వగా.. కొన్ని రిజర్వేషన్ కేటగిరిల్లో అభ్యర్థులు లేనందున 15,941 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. మిగిలిపోయిన 406 పోస్టులతోపాటు కొత్తగా వచ్చే ఖాళీలతో వచ్చే ఏడాది మరో డీఎస్సీ నిర్వహించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ