దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.) పహల్గాం దాడికి పాల్పడిన ఉగ్రవాదులు (Pahalgam Attackers) ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లను వాడుకొని తమకు అవసరమైన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. తాజాగా ఉగ్రమూకకు సాయం చేసిన ఒక ఓవర్ గ్రౌండ్ వర్కర్ (ఓజీడబ్ల్యూ)ను దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకొన్నాయి. అతడి నుంచి కీలక సమాచారం బయటకు వచ్చింది.
‘‘ఆపరేషన్ మహాదేవ్ సమయంలో మూడు మొబైల్ ఛార్జర్లను ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం నుంచి స్వాధీనం చేసుకొన్నాం. ఆ తర్వాత దర్యాప్తులో జరిగిన టెక్నికల్ వెరిఫికేషన్‌లో వీటిల్లో ఒక ఛార్జర్ ఓ ఫోన్‌తో పాటు వచ్చినట్లు గుర్తించాము’’ అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. దీనిని ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌పై కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు. దీనిని స్థానికంగా ఉండే ఇక్బాల్ కంప్యూటర్స్‌కు చెందిన ముసాయిబ్ అహ్మద్ చోపాన్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఆ తర్వాత తాను దానిని ఎండీ యూసఫ్ కటారికి విక్రయించినట్లు ముసాయిబ్ అహ్మద్ అంగీకరించాడు. ఇక యూసఫ్‌ను దర్యాప్తు అధికారులు ఇంటరాగేషన్ చేయగా.. తానే డాచిగావ్ అడవుల్లో దాగిన ఉగ్రవాదులకు వాటిని అందజేసినట్లు అంగీకరించాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు