తెలంగాణ, కామారెడ్డి. 25 సెప్టెంబర్ (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల
సమస్యలను పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేపట్టిన 28 మంది టీచర్లను కామారెడ్డి జిల్లా నర్సుల్లాబాద్ మండలం లో పోలీసులు అర్ధరాత్రి ముందస్తు అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు తరలి వెళ్తున్న వారిని నిజాంసాగర్ పోలీసులు అడ్డుకుని, స్థానిక పంచాయతీ రాజ్ అతిథి గృహంలో నిర్బంధించారు. నిర్బంధంలో ఉన్న అంగన్వాడీ టీచర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తమను ఆడపడుచుల్లా కాకుండా, ఉద్యోగుల్లా కూడా చూడటం లేదని కన్నీరు పెట్టుకున్నారు.
తమ సమస్యలను తుంగలో తొక్కి, నిత్యం కష్టపడే మమ్మల్ని పట్టించుకోవడం మానుకున్నారు అంటూ మండిపడ్డారు. రూ.18 వేల వేతనల మాటేమాయే ? దసరా సెలవులేవీ? ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ పాఠశాలల ఏర్పాటు తమ భవిష్యత్తు ను నాశనం చేస్తుందని టీచర్లు ఆరోపించారు. దీనికి తోడు.. కనీస వేతనం రూ.18,000 అందించడం లేదని, దసరా సెలవులు కూడా ఇవ్వకుండా తమను శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు