హైదరాబాద్, 25 సెప్టెంబర్ (హి.స.)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్తో స్వదేశంలో జరగనున్న టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్మెన్ శుబ్మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించనుండగా.. సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నారు. ఇకపోతే, ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు. గాయం నుంచి ఇంకా కోలుకోని కారణంగా.. వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ ఈ సిరీస్కు దూరమయ్యాడు. అలాగే, ఇంగ్లండ్ పర్యటనలో నిరాశపరిచిన కరుణ్ నాయర్పై వేటు పడింది. ఏడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నాయర్, నాలుగు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ చేయడంతో వేటు తప్పలేదు.
వికెట్ కీపర్ కోటాలో పంత్ గైర్హాజరీతో ధ్రువ్ జురెల్ తో పాటు తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశను కూడా చోటు దక్కింది. గాయం కారణంగా ఇంగ్లండ్ సిరీస్ మధ్యలో దూరమైన ఆంధ్ర ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విండీస్తో సిరీస్తో తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక బౌలింగ్ విభాగం విషయానికి వస్తే.. పేస్ బౌలింగ్లో జస్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్తో కలిసి ప్రసిద్ కృష్ణ సేవలు అందించనున్నారు. స్పిన్ విభాగంలో స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో పాటు వాషింగ్టన్ సుందర్ బరిలో దిగనున్నారు. ఈ టెస్టు సిరీస్ 2025-27లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 14 వరకు జరుగుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..