తెలంగాణ, వనపర్తి. 25 సెప్టెంబర్ (హి.స.)
పీఎం ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. గురువారం పానగల్ మండల కేంద్రంతో పాటు బుసిరెడ్డిపల్లి గ్రామాల్లో కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన సర్వే చేయడంలో నిరక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల కొరకు ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా దరఖాస్తు చేసుకున్న కుటుంబాల నుండి ఎల్ (1) కేటగిరిలో ఉన్న వారి వివరాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఆన్ లైన్ లో డేటా పూర్తి చేయాలన్నారు. పంచాయతీ సెక్రెటరీలు క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించి ఆన్ లైన్ చేయాలన్నారు.
బుసిరెడ్డిపల్లి పంచాయతీ కార్యదర్శికి సర్వే చేయడంపై సరైన అవగాహన లేకపోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సర్వే చేయడంలో అలసత్వం ప్రదర్శించిన కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు