లేహ్, దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.) లద్దాఖ్‌లో ఆందోళనకారులు రెచ్చిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించడంతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేర్చాలన్న డిమాండ్లతో ప్రారంభించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. బుధవారం లేహ్ నగరంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. స్థానిక బీజేపీ కార్యాలయానికి నిప్పుపెట్టారు. పోలీసులతోనూ ఘర్షణకు దిగారు. వారిపై రాళ్లు రువ్వారు. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్ప వాయువును ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. ఈ హింసాత్మక ఘటనల్లో నలుగురు మరణించగా, 22 మంది పోలీసులు సహా 70 మందికిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. నిరసనలు హింసగా మారడంతో కేంద్ర ప్రభుత్వం లేహ్‌లో ఆంక్షలు విధించింది. నిరసనలు, ఎక్కువ మంది గుమిగూడడంపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీయే ప్రభుత్వం 2019, ఆగస్టు 5న రద్దు చేసింది.
ఆ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఆ తర్వాత జమ్మూకశ్మీరు, లద్దాఖ్‌లకు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్లు వచ్చాయి. లద్దాఖ్‌ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ పరిధిలో చేర్చాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈ డిమాండ్లతో పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో 15 మంది నిరాహార దీక్ష ప్రారంభించారు. వారిలో ఇద్దరి ఆరోగ్యం క్షీణించడంతో బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో వాంగ్‌చుక్ మంగళవారం తన నిరశనను విరమించారు. హింసకు పాల్పడవద్దని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ‘లేహ్ అపెక్స్ బాడీ (ఎల్‌ఏబీ)’కి చెందిన యువజన విభాగం ఆందోళనలకు పిలుపునిచ్చింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ