అనంతపురం, 26 సెప్టెంబర్ (హి.స.)
: శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో 2019-24 నడుమ జరిగిన అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్(శాసనసభలో తెలిపారు. కంప్యూటర్ల కొనుగోలులో దుర్వినియోగం, యూనివర్సిటీ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతులు, నియామకాలు, రిక్రూట్‌మెంట్‌లో రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకపోవడంపై కమిటీ వేస్తామన్నారు. వంద రోజుల్లో నివేదిక తెప్పించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు ఎంఎస్ రాజు, పల్లె సింధూర రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిస్తూ... పారదర్శకంగా విశ్వవిద్యాలయాలు నడిపించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం ఉందని తెలిపారు. గురువారం ఆంధ్రా యూనివర్సిటీలో ఒక విద్యార్థి ఫిట్స్‌తో చనిపోయారని.. దీనిపై కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళన చేయడం సరికాదన్నారు. ప్రభుత్వపరంగా ఎలాంటి తప్పు లేకపోయినా రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకంగా యూనివర్సిటీ వీసీలను నియమిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రా యూనివర్సిటీని టాప్ -100 వర్సిటీల్లో ఒకటిగా తీర్చిదిద్దే బాధ్యతను ముఖ్యమంత్రి తనకు అప్పగించారని పేర్కొన్నారు. కొంతమంది వారి స్వార్థం కోసం కావాలని విశ్వవిద్యాలయాల్లో గొడవలు సృష్టించడం బాధాకరమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ