దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.)నొయిడా: కాలపరీక్షకు నిలిచినా.. రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకే సాగుతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా రక్షణ బంధం కొనసాగుతోందని గుర్తు చేశారు. ఆత్మ నిర్భరత (స్వయం సమృద్ధి) సాధించేందుకు కృషి చేస్తున్నామని, భారత్ లాంటి దేశం ఏ ఒక్కరిపైనా ఆధారపడకూడదని అభిప్రాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని నొయిడాలో గురువారం యూపీ అంతర్జాతీయ ట్రేడ్ షో-2025 ప్రారంభమైంది. ఇందులో రష్యా అంతర్జాతీయ భాగస్వామిగా ఉంది. ఈ ట్రేడ్ షోలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఈసారి అంతర్జాతీయ ట్రేడ్ షో వాణిజ్య భాగస్వామిగా రష్యా ఉంది. అంటే దీనిద్వారా మనం కాల పరీక్షకు నిలిచినా బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు, ఆయుధాలను కొంటున్న భారత్‌పై మరిన్ని ఆంక్షలకు సిద్ధమవుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తద్వారా ఆ దేశం హెచ్చరికలను భారత్ పట్టించుకోదనే సందేశాన్ని ఆయన ఇచ్చినట్లయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ