న్యూఢిల్లీ/దిల్లీ: 26, సెప్టెంబర్ (హి.స.) దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు అసదుల్లా అక్తర్ ఉరిశిక్ష పై సుప్రీంకోర్టు గురువారం స్టే విధించింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలో రెండుచోట్ల జరిగిన బాంబు పేలుళ్లలో 18 మంది మరణించగా.. 131 మంది తీవ్రగాయాలపాలైన సంగతి తెలిసిందే. ఆ పేలుళ్లకు కారకులైన నిషేధిత ఇండియన్ ముజాహిదీన్ సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్, అఖ్తర్ సహా ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ 2016 డిసెంబరులో ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఢిల్లీ జైలులో ఉన్న అక్తర్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్‌వీ అంజారియాతో కూడిన ధర్మాసనం ఆ పిటిషన్‌ను విచారించి.. 8 వారాల్లోగా దీనిపై నివేదికివ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతవరకూ అతడి మరణశిక్షపై స్టే విధిస్తున్నట్టు తెలిపింది. ఈ కేసులో ప్రొబేషన్ అధికారులు నివేదిక సమర్పించాలని, జైల్లో నిందితుడి ప్రవర్తన, అతడికి అప్పజెప్పిన పని గురించి జైలు సూపరింటెండెంట్ నివేదిక సమర్పించాలని సుప్రీం కోరింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ