అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)
దేవీ శరన్నవరాత్రుల్లో ఐదో రోజు అయిన శుక్రవారం ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మను శ్రీ మహాలక్ష్మి అవతారంలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మలగన్న అమ్మగా ప్రసిద్ధి పొందిన దుర్గా మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి రూపాలతో కూడా నిత్యం పూజలందుకుంటున్న విషయం తెలిసిందే. సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వాసం.
శ్రీ మహాలక్ష్మి అమ్మవారి స్వరూపం
శరన్నవరాత్రులలో ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి స్వరూపంలో ఇరువైపులా గజ రాజులు ఉండగా, చతుర్భుజాలతో, ఒక హస్తం అభయ ముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాపాడుతూ ఉంటుంది. మహాకాళి, మహాలక్ష్మీ, మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.
శ్రీ మహాలక్ష్మీ పూజా విశిష్టత
శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న దుర్గమ్మను కొలిస్తే ఏ రకమైన బాధలు ఉండవని భక్తుల నమ్మకం. అంతేకాదు నేడు సకల సంపదల స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారిని దర్శించుకుంటే సకలసంపదలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు.
మంగళ ప్రదాయిని
ఆదిపరాశక్తి మూడు శక్తులలో ఒక శక్తి అయిన మహాలక్ష్మీ అమిత పరాక్రమంతో మహిషుడనే రాక్షసుడిని సునాయాసంగా సంహరించి మహిషాసురమర్దినిగా పూజలందుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అష్టలక్ష్ముల సమిష్టి రూపమైన దుర్గమ్మను మహాలక్ష్మీగా భక్తులు పూజిస్తారు.
అమ్మవారికి సమర్పించాల్సిన వస్త్రాల రంగు: ఈ రోజు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి
అమ్మవారిని పూజించేందుకు ఉపయోగించే పూలు: ఎర్ర కలువలతో, ఎర్ర గులాబీలతో అమ్మవారిని పూజించాలి
నైవేద్యం: నేడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంగా పూర్ణం బూరెలను సమర్పించాలి.
పఠించాల్సిన శ్లోకం:
యాదేవి సర్వ భూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా! అని స్తుతిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే దారిద్య్ర బాధలు తొలగిపోతాయి. అలాగే నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే! మహాలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తే అష్టైశ్వర్యాలు సొంతమవుతాయి. అలాగే ఈ రోజు అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణ చేసుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది.
మూడు గంటల నుంచే అమ్మవారి దర్శనం :దుర్గగుడి ఈవో శీనా నాయక్
దసరా శరన్నవరాత్రులలో ఐదవ రోజైన శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి గా భక్తులకు దర్శనమిస్తారని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల నుంచే భక్తులను దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా కొందరు వీఐపీలు బంగారు వాకిలి నుంచే అమ్మవారిని దర్శించుకున్నారని, మిగిలిన వారు కూడా ఇదే రీతిలో దర్శించుకుంటే సామాన్య భక్తులకు మరింత త్వరగా దర్శనం లభిస్తుందని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండకుండా చూడాల్సిన బాధ్యత అందరి పైన ఉందని ఈవో శీనా నాయక్ చెప్పారు. ఇకపోతే గురువారం నాడు అమ్మవారు శ్రీ కాత్యాయనీ దేవి గా దర్శనమిచ్చారని పదేళ్లకు ఒకసారి ఈ అలంకారంలో దర్శనమిస్తారని దాని వల్ల గురువారం భక్తుల తాకిడి పెరిగిందని ఈవో శీనా నాయక్ తెలిపారు.
నేటి దుర్గమ్మ అవతారం
శరన్నవరాత్రులలో ఐదో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ అమ్మవారిగా దర్శనమిస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి