హైదరాబాద్, 27 సెప్టెంబర్ (హి.స.) సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్లే హైదరాబాద్ నగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రరావు ధ్వజమెత్తారు. తీవ్ర వర్షాలు ఉంటాయి అని వెదర్ రిపోర్ట్ వచ్చినా ప్రభుత్వం అప్రమత్తంగా లేదు అని మండిపడ్డారు. హైదరాబాద్ నగరంలో వర్షాలు, మూసీ నది ఉధృతిపై హరీశ్రావు స్పందించారు.
భారీ వర్షాలు, వరదలు పోటెత్తినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలకు ఉపక్రమించక లేదు. ఇది దుర్మార్గం. ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్ అని హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద అంచనా వేయడంలో, ప్రణాళికలు వేయడంలో, ప్రభుత్వ విభాగాల సమన్వయంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని మండిపడ్డారు.
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే ఎంజీబీఎస్ఈ ప్రయాణికులు వరద నీటిలో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పండగ వేళ సొంతూళ్లకు వెళ్ళలేక, భయం భయంగా రాత్రి నుండి పడిగాపులు కాస్తున్నారు. మూసీ నది ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించాలి అని హరీశ్రావు పేర్కొన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..